మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌ను కొనడంతోనే అటు టెస్లాకు ఇటు మస్క్ కు కష్టాలు వచ్చాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొంటానంటూ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటించిన మస్క్, ఊగిసలాట తర్వాత అక్టోబర్‌లో ఎట్టకేలకు కొన్నారు. డీల్ గురించి ప్రకటించిన దగ్గర నుంచి ఆయన 23 బిలియన్ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను అమ్మేశారు. ట్విటర్‌ను కొన్నప్పటి నుంచి గరిష్టంగా దానికే సమయాన్ని వెచ్చిస్తున్నారని, టెస్లాను పట్టించుకోవడం లేదనే అభిప్రాయంతో మిగతా షేర్‌హోల్డర్లూ అదే బాట పట్టారు. ఇవన్నీ కంపెనీ షేరుపై ప్రతికూల ప్రభావం చూపాయన్న అభిప్రాయం ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ కారణంగా టెస్లా కార్లకు డిమాండ్ బలహీనపడుతోంది. కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టెస్లా తొలిసారిగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముందు 3,750 డాలర్ల డిస్కౌంటు ఇస్తామని ప్రకటించిన టెస్లా, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆ తర్వాత దాన్ని ఏకంగా 7,500 డాలర్లకు పెంచింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పోటీ పెరుగుతున్న క్రమంలో కీలకమైన చైనా, అమెరికా మార్కెట్లలో డిమాండ్ బలహీనపడుతుండటం టెస్లాకు అర్థమవుతోంది కాబట్టే ఇలా డిస్కౌంట్ల బాట పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే కాకుండా అమెరికా ఎకానమీ ఈ ఏడాది మాంద్యంలోకి జారుకుంటుందని, కార్లకు డిమాండ్ పడిపోతుందని వస్తున్న వార్తలూ టెస్లాకు ప్రతికూలంగా ఉంటున్నాయి. అంతేకాకుండా ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్, జీఎం, హ్యుందాయ్ వంటి దిగ్గజాలు బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ టెస్లాకు దీటుగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను దింపేందుకు కసరత్తు చేస్తుండటమూ కంపెనీకి సవాలుగా మారుతోంది. కీలకమైన అమెరికా ఈవీ మార్కెట్లో టెస్లా వాటా 2020లో 79% కాగా గతేడాది తొలి 9 నెలల్లో 65%కి పడిపోయింది. 2025 నాటికి ఇది 20% దిగువకు పడిపోవచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మొబిలిటీ అంచనా. అమ్మకాలు అంతంతే అయినా అసాధారణంగా ట్రిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ట్రేడ్ అవడం టెస్లాకు క్రమంగా ప్రతికూలంగా మారింది. ఒక దశలో టెస్లా వేల్యుయేషన్.. ప్రపంచంలోనే టాప్ 12 భారీ ఆటో దిగ్గజాలన్నింటినీ మించి పలికింది. కానీ వాటి అమ్మకాలతో పోలిస్తే టెస్లా విక్రయాలు తూగడం లేదు. ఇదంతా మార్కెట్‌కు అవగతమయ్యే కొద్దీ కంపెనీ వేల్యుయేషన్ ట్రిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం దాదాపు 400 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతే గాకుండా మస్క్ చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండకపోతుండటం కూడా ఇన్వెస్టర్లలో అపనమ్మకం కలిగిస్తోంది. ఏదేదో చేసేస్తున్నానంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసే మస్క్, వాటిని ఆచరణలో మాత్రం చూపడం లేదంటూ విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు దాదాపు నాలుగేళ్ల క్రితం ఆవిష్కరించిన సైబర్‌ట్రక్ ఉత్పత్తి 2021లో మొదలుపెడతామని మస్క్ చెప్పినప్పటికీ ఈ ఏడాది వరకూ వాయిదా పడుతూ వచ్చింది. 2024లో గానీ పూర్తి స్థాయిలో తయారీ పుంజుకోదు. ఫోర్డ్, రివియన్ లాంటి కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ పికప్‌లను అమ్మేస్తుండగా టెస్లా ఎప్పటికి పుంజుకుంటుందనేది సందేహంగా మారింది.
0 Comments