తెలంగాణ లోని మహబూబ్‌నగర్ జిల్లా మూలాలున్న రాజాచారి అత్యంత అరుదైన ఘనత సాధించారు. ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అంతరిక్షంలో పరిశోధనల కోసం ఆకాశంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకొచ్చి రోదసిలో రాజాచారి సంచరించారు. ఆరున్నర గంటలకు పైగా అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసి రికార్డ్ సృష్టించారు. ఐఎస్ఎస్‌కు సంబంధించిన ఓ కీలక ప్రయోగాన్ని రాజాచారి విజయవంతంగా పూర్తి చేశారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫ్లైట్ ఇంజనీర్ కైలా బారన్‌తో కలిసి రాజాచారి స్పేస్‌వాక్ మొదలుపెట్టారు. ఐఎస్ఎస్ నుంచి బయటకొచ్చి స్పేస్ స్టేషన్ స్టార్ బోర్డు-4 ట్రస్ వద్దకు చేరుకుని ఇప్పటికే ఉన్న సోలార్ ప్యానళ్ల స్థానంలో కొత్త ప్యానళ్లను అమర్చారు. అనంతరం ఇద్దరూ కలిసి మొత్తం ఆరు 'ఐఎస్ఎస్ రోల్ ఔట్ సోలార్ ఆరే (ఐఆర్‌ఓఎస్ఏ)'లను మార్చారు. థామస్ మార్ష్‌బర్న్, మథీయాస్ మౌరర్ అనే మరో ఇద్దరు వ్యోమగాములు ఐఎస్ఎస్ లోపల నుంచి వారిని నిరంతరం పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేశారు. రాజాచారి బృందం అమర్చిన కొత్త సోలార్ ప్యానళ్ల్లు సూర్యకాంతిని సంగ్రహించి, స్పేస్ స్టేషన్‌లో రోజువారీ పరిశోధనలకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అందిస్తాయి. స్పేస్ స్టేషన్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు నాసా ఈ ప్రయోగం చేసింది. ఐఎస్ఎస్‌కు ప్రస్తుతం 160 కిలో వాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండగా కొత్త ప్యానళ్ల అమరిక తర్వాత ఇది 215 కిలోవాట్లకు పెరగనుంది. రాజాచారికి ఇది తొలి స్పేస్ వాక్ కాగా బారన్‌కు రెండోది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ క్రూ-3 మిషన్‌కు 2020లో కమాండర్‌గా ఎంపికైన రాజాచారి గత ఏడాది నవంబర్‌లో ఐఎస్ఎస్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన స్పేస్‌వాక్ కోసం వారం రోజులుగా అక్కడే సిద్ధమమయ్యారు. అన్నిరకాల పరీక్షలు, భూమి మీద ఉన్న నిపుణులతో చర్చల అనంతరం నాసా స్పేస్‌వాక్‌కు అనుమతినిచ్చింది. మార్చి 23న నాసా మరోసారి స్పేస్ వాక్ నిర్వహించనుంది. రాజాచారి నేపథ్యం.. రాజాచారి తాత ముత్తాతలు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారు. ఆయన తాతగారి హయాంలో వారి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. రాజాచారి తాత ఉస్మానియా యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాసాచారి ఉస్మానియాలో ఇంజనీరింగ్ చదివి ఉన్నత చదువుల నిమిత్తం 1970ల్లో అమెరికా వెళ్లారు.
0 Comments