Ad Code

రెండు రోజుల లాక్‌డౌన్‌ పెడదామా?


ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రస్థాయికి చేరుకోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యం బారినుంచి ఢిల్లీని కాపాడటానికి ఏం ప్రణాళిక సిద్ధం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా జీవించగలరని నిలదీసింది. పరిస్థితి చాలా సీరియ్‌సగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఆదిత్య దుబే అనే 17ఏళ్ల విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన బెంచ్‌ శనివారం విచారణ జరిపింది. ''పరిస్థితి ఎలా ఉందో మీరూ చూస్తూనే ఉన్నారు. గాలి నాణ్యత తగ్గిపోతుండటంతో ఇళ్లల్లో కూడా మేం మాస్కులు ధరించాల్సి వస్తోంది'' అని విచారణ సందర్భంగా జస్టిన్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో పరిస్థితి మెరుగుపడేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్‌, హరియాణా, యూపీలో ఏటా పంట చేతికొచ్చిన తర్వాత మిగిలిన వ్యర్థాలను రైతులు పొలాల్లోనే తగులబెట్టడం వల్ల వచ్చే పొగే ఈ సమస్యకు కారణమని కోర్టుకు కేంద్రం వివరించింది. రైతులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సి ఉందని పేర్కొంది. దీనిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ''కేవలం రైతుల వల్లే వాయు కాలుష్యం పెరుగుతోందని ఎలా చెబుతారు? ప్రస్తుత పరిస్థితులకు అదో కారణం మాత్రమే'' అంటూ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాపై అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రతిదానికీ రైతులను నిందించడం ఒక ఫ్యాషన్‌ అయిపోయిందని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. ''నేనూ రైతునే, ప్రధాన న్యాయమూర్తి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినవారే...'' అని వ్యాఖ్యానించారు. ఇక ''ఢిల్లీలో ఏక్యూఐ స్థాయి దాదాపు 500కు చేరిందని మీరే చెబుతున్నారు. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు?'' అని ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది రాహుమ్‌ మెహ్రాను జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. కాలుష్యాన్ని పీల్చుకొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మాగ్‌ టవర్లు పనిచేస్తున్నాయా అని ప్రశ్నించారు. దీనికి ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ స్మాగ్‌ టవర్లు పనిచేస్తున్నాయన్నారు. అనంతరం విచారణను ఈ నెల 15కు ధర్మాసనం వాయిదా వేసింది. ఈనేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సోమవారం నుంచి వారం పాటు సెలవులు ప్రకటించింది. ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించే ప్రతిపాదనను సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu