ద్వివేదుల విశాలాక్షి కథా, నవలా రచయిత్రి.1929, ఆగస్టు 15న విజయనగరంలో జన్మించిన ద్వివేదుల విశాలాక్షి విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది.తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగిన విశాలాక్షి అనేక కథలు, కవితలు, వ్యాసాలు, రేడియో నాటికలు రచించింది. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, మలేషియా, సింగపూర్ దేశాల్లో పర్యటించి తన సాహిత్య వాణి వినిపించింది. 1960వ దశకంలో ఆమె రచించిన "వారధి" నవల రెండు కుటుంబాల కథగా వెండి తెరకెక్కింది. 1974లో విడుదలైన వస్తాడే మా బావ చిత్రానికి మాటలు రాసి సినీరంగంతోనూ అనుంబంధాన్ని కొనసాగించింది. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ఆమె ‘వారధి' నవలను 1973లో పలు భారతీయ భాషలలోకి అనువదించి ప్రచురించారు.తన పుస్తకాల హక్కులను విశాఖపట్నంలోని ద్వారకానగర్ పౌరగ్రంథాలయానికి ఆమె వ్రాసి యిచ్చింది. ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్, పీహెచ్‌డీలు పొందారు. విశాలాక్షి నవంబరు 7, 2014 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్టణంలో తన 85వ యేట మరణించింది.
0 Comments