కొవిడ్ మహమ్మారి కారణంగా మూతపడిన శబరిమల ఆలయం సుధీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు తెరుచుకుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకులు కందరారు మహేష్ సమక్షంలో మరో అర్చకుడు వీకే జయరాజ్ ఆలయ గర్భగుడి తెలుపులు తెరిచారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శబరిమల ఆలయ బోర్డు తెలిపింది. శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత తెరుచుకున్న శబరిమల ఆలయంలోకి ఇవాళ్టి నుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. డిసెంబర్ 26న శబరిమలలో మండల పూజ ముగుస్తుండగా.. మకరవిళుక్క పండుగ కోసం మరలా డిసెంబర్ 30న తిరిగి ఆలయం తెరుచుకోనుంది. అలాగే జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత 20వ తేదీ ఆలయాన్ని మూసివేయనున్నారు. అయితే అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు పాటించాలని దేవస్థానం అధికారులు స్పష్టంచేశారు. భక్తలు కచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా నెగెటివ్ రిపోర్ట్ వెంట తీసుకురావాలని, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు హెల్త్ చెకప్ చేయించుకుని రావాలని స్పష్టంచేశారు. శబరిమల ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పంపాలో స్నానానికి అనుమతి ఇచ్చిన అధికారులు.. సన్నిధానంలో బస చేసేందుకు మాత్రం అనుమతులు లేవని తెలిపారు. అలాగే పంపాలో వాహనాలకు పార్కింగ్ వసతి ఉండదన్నారు. వాహనాలకు నీలక్కల్ వరకే అనుమతి ఉంటుందని.. అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులో అందుబాటులో ఉంటాయన్నారు. దర్శనం ముగించుకున్నా భక్తులు ఆలయ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని, కాలి నడకన వచ్చే భక్తులు స్వామి అయ్యప్పన్ రోడ్డును మాత్రమే ఉపయోగించుకోవాలని స్పష్టంచేశారు. ఇక దర్శనం తర్వాత ఇచ్చే స్వామివారి ప్రసాదం కోసం పంపా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. నెయ్యాభిషేకం కోసం భక్తులు తీసుకొచ్చే నెయ్యిని సేకరించేందుకు కౌంటర్లు సిద్ధంచేశారు దేవస్థానం అధికారులు.
0 Comments