Ad Code

కయ్యానికి కాలుదువుతున్న చైనా


అన్ని ఒప్పందాలను తుంగలో తొక్కి భారత్‌తో వాస్తవాధీన రేఖ వద్ద చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత భూభాగాలను ఆక్రమించుకునేందుకు డ్రాగన్ దేశం వరుస పన్నాగాలు పన్నుతోంది. పైగా దాని దుందుడుకు చర్యలను చట్టబద్ధం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల నూతన భూసరిహద్దు చట్టానికి ఆమోదం తెలిపింది. దేశ సరిహద్దు ప్రాంతాల రక్షణ, స్వలాభార్జనపై చైనా జాతీయ చట్టాన్నిరూపొందించడం ఇదే తొలిసారి. ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. జాతీయ భద్రతను మెరుగ్గా నిర్వహించడం, ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య సరిహద్దు సంబంధిత విషయాలను చట్టపరమైన స్థాయిలో నిర్వహించడమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్టు చైనీస్ మీడియా చెబుతోంది. వివాదాస్పద భూ సరిహద్దుల వెంబడి తన చర్యలను సమర్థించుకోవడానికి డ్రాగన్ కంట్రీ నూతన చట్టాన్ని రూపొందించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఈ కొత్త చట్టం దేశం సరిహద్దుల వెంబడి దండయాత్ర, ఆక్రమణ, చొరబాటు, రెచ్చగొట్టడం వంటి చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఆదేశించిందని నివేదికలు తెలుపుతున్నాయి. అవసరమైతే సరిహద్దును మూసివేయాలని చట్టం చెబుతుందని, అందుకు చట్టపరమైన విధివిధానాలను కూడా రూపొందించిన్నట్లు జర్మనీ మీడియా  వెల్లడించింది. సరిహద్దు రక్షణను బలోపేతం చేయడానికి, ఆర్థిక సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి, సరిహద్దు ప్రాంతాలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతున్నట్లు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వార్తాపత్రిక 'చైనా డైలీ' పేర్కొన్నది. ఈ చట్టం సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల జీవనాన్ని ఆచరించాలని చెబుతోంది. ప్రజలు అక్కడ పని చేయడం కోసం ప్రజా సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడి ద్వారా వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను పరిష్కరించాలని చైనా భావిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు ఎలా నివసిస్తారనే సందేహాలు కూడా చట్టం నివృత్తి చేసింది. సరిహద్దు రక్షణ, సరిహద్దు ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధి మధ్య సమన్వయాన్ని చైనా ప్రోత్సహిస్తుందని కొత్త చట్టం  చెబుతోంది. అయితే పహారా కాయడానికి దేశ ఆర్మీ సిబ్బందికి సామాన్య పౌరులు సైతం సహకరించాల్సిందిగా చట్టం చెబుతున్నట్లు జపాన్ మీడియా వెల్లడించింది. చైనా టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్ భారతదేశంతో ఘర్షణలు ప్రాంతీయ ఉద్రిక్తతలలో ఒకటిగా ఉంటున్నట్టు గుర్తు చేసింది. దీనికి వ్యతిరేకంగా కొత్త చట్టాన్ని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆమోదించిందని తెలిపింది. ఈ చట్టం సరిహద్దు వ్యవహారాలకు సంబంధించి విస్తృత పరిధిని కలిగి ఉంది. ప్రాదేశిక సరిహద్దు కార్యకలాపాల్లో నాయకత్వ వ్యవస్థ, ప్రభుత్వ బాధ్యతలు, సైనిక పనులు ఈ చట్టం స్పష్టం చేయనుంది. భూ సరిహద్దుల సర్వేయింగ్, సరిహద్దుల రక్షణ, నిర్వహణ వంటి వాటిని కూడా ఇది చట్టబద్ధం చేయనుంది. అలాగే భూ సరిహద్దు వ్యవహారాలపై అంతర్జాతీయ సహకారాన్ని స్పష్టం చేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu