పంజాబ్ రాజకీయాల్లో కెప్టెన్ అమరీందర్ తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీ (47) పేరును కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. చరణ్‌జిత్ సింగ్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీశ్ రావత్ ఆదివారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. కాసేపట్లో కొత్త సీఎల్పీ నాయకుడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కలవనున్నారు. కెప్టెన్ రాజీనామా తర్వాత తదుపరి సీఎం విషయంలో పలు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, ప్రతాప్ సింగ్ బజ్వా, మాజీ సీఎం రాజేందర్ కౌర్ భట్టల్, సుఖ్‌జిందర్ పేర్లు వినిపించాయి. ఒక దశలో సుఖ్‌జిందర్ పేరును ఖరారు చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ కొద్ది గంటల్లోనే అనూహ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్‌జిత్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. 1973 ఏప్రిల్ 2న జన్మించిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ చామ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015-2016 మధ్య అసెంబ్లీలో కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవవహరించారు. అమరీందర్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
0 Comments