దిల్లీ లోని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్, గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. మహాత్మగాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్ 28నే వీరు పార్టీలో చేరాల్సి ఉండగా.. కొంచం ఆలస్యంగా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీతో భేటీ అయినప్పుడే కన్నయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. సీపీఐలో ఇమడలేకపోవడం ఆయన చేరికకు కారణమని తెలుస్తోంది. ఆయనను బిహార్ పార్టీశాఖకు అధ్యక్షుడిని చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు గుజరాత్ వాద్గాం నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ సైతం చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో టచ్‌లో ఉన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్‌జిత్ సింగ్‌ను ఎంపిక చేయడాన్ని ఆయన స్వాగతించడం ఇందుకు బలం చేకూరింది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేశ్ చేరిక కాంగ్రెస్‌కు కొంతమేర కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయనను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
0 Comments