చదువుకుంటూ ఉదయం పూట పేపర్ వేస్తున్న ఓ విద్యార్థి చతురత, ఆత్మవిశ్వాసం, ఆలోచన మంత్రి కేటీఆర్‌ను ఆకట్టుకుంది. జగిత్యాల పట్టణంలోని 48వ వార్డుకు చెందిన జయప్రకాశ్ (12) జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్)లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం సైకిల్ పై ఇంటింటికీ దిన పత్రికలు వేస్తున్నాడు. ఇలా వేస్తున్న సమయంలో చదువుకునే వయస్సులో పేపర్ వేయడం ఏమిటని స్థానికులు ఒకరు బాలుడిని ప్రశ్నించారు. ' ఏం పేపర్ వేయవద్దా.. చదువుకుంటున్నా పని చేసుకుంటున్నా.. కష్టపడితే తప్పెట్టయితది. ఇప్పుడు కష్టపడితే పెద్దయినక ఏమైనా చేయవచ్చని సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా బాలుడికి, సదరు వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణను ఒక యువకుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రికరించి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. స్థానికంగా ఆ వీడియో క్లిప్పింగ్ ఫేస్‌బుక్‌తో పాటు, వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను ఒకరు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌కు టాగ్ చేశారు. వీడియోపై స్పందించిన కేటీఆర్ విద్యార్థి ఆత్మవిశ్వాసం, ఆలోచన, భావవ్యక్తీకరణ, తనకు చాలా నచ్చిందని పేర్కొన్నారు. చదువుతున్నపుడు పని చేస్తే తప్పేంటి అంటూ విద్యార్ధి పేర్కొన్న తీరును మంత్రి అభినందించారు. విద్యార్థి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
0 Comments