ఎస్బీఐ బాటలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) ప్రయాణిస్తోంది. తన ఖాతాదారులకు రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసింది. అటుపై వడ్డీరేట్లపై రాయితీలు కల్పిస్తోంది. రిటైల్ బోనంజా మాన్‌సూన్ ధమాకా అనే స్కీం కింద ఈ రాయితీలు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు ఈ బోనంజా అమలులో ఉంటుందని వెల్లడించింది. హోం లోన్లు మొదలు కార్లు, బంగారం రుణాలకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది. 6.90 నుంచి 7.30 శాతం వడ్డీరేట్లకే హోంలోన్లు, కార్ల రుణాలు అందిస్తున్నది. హోంలోన్ తీసుకున్న రుణ గ్రహీతలు బకాయిలు లేకుండా రుణ వాయిదాలు చెల్లిస్తే రెండు ఈఎంఐలను మాఫీ చేయడం వంటి ఆకర్షణీయ ఫీచర్లను తీసుకొచ్చింది. ఇక ఎటువంటి ప్రీ-పేమెంట్, ప్రీ-క్లోజర్, పాక్షిక చెల్లింపుల చార్జీలు లేకుండా కార్లు, ఇండ్ల కొనుగోళ్లకు 90 శాతం రుణ పరపతి కల్పిస్తున్నది.
‘మా కస్టమర్లకు బంగారం, ఇండ్లు, కార్ల రుణాలపై ఆకర్షణీయ ఆఫర్లతో కూడిన గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించాం. తక్కువ వడ్డీరేట్లపై లబ్ధి పొందే వారికి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నాం ‘ అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ తమ్తా చెప్పారు. రూ.20 లక్షల వరకు బంగారం రుణాలపై 7.10 శాతం వడ్డీ అందిస్తున్నది. ఇందులో రూ.లక్ష వరకు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. ఎంపిక చేసిన శాఖల్లో ‘గోల్డ్ లోన్‌పాయింట్ ‘ కౌంటర్ ఏర్పాటు చేసి 15 నిమిషాల్లో బంగారం రుణాలు అందజేస్తామని తెలిపింది. ఇంతకుముందు ఎస్బీఐ ఈ నెలాఖరు వరకు ఇంటి రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసిన సంగతి తెలిసిందే.
0 Comments