తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో బాబా అవతారమెత్తిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన విశ్వచైతన్య హైద్రాబాద్ లో చదివి, అక్కడే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి దివాలా తీసి, బాబా అవతారమెత్తి మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. నల్లగొండ జిల్లాలోని పీఏపల్లి మండలం అజమాపురంలో పది ఎకరాల స్థలంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని.. కొంత కాలంగా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఆశ్రమంలో హోమాల పేరుతో మోసాలు జరుగుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా భక్తులను కూడా ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఓ బాధిత మహిళ ఫిర్యాదుతో నకిలీ బాబా భాగోతం బట్టబయలయింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు బురిడీ బాబా విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకుని, అతని నుంచి నగదు, నగలు, కోట్ల విలువ చేసే ల్యాండ్ డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బాబా మోసాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
0 Comments