Ad Code

నెంబర్ 2 షియోమీ

 

తక్కువ ధరకే ఎక్కువ స్పెసిపికేషన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న  చైనీస్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమీ అమ్మకాల జోరు కొనసాగిస్తుంది. అందులోనూ ఇటీవల ఫోన్లను వరుసగా లాంచ్ చేస్తూ అమ్మకాలను విపరీతంగా పెంచుకుంది. దీంతో ప్రపంచవ్యాప్త మొబైల్ అమ్మకాల్లో దిగ్గజ సంస్థ యాపిల్​ను షియోమీ దాటేసింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్​ఫోన్​ అమ్మకందారుగా తొలిసారి నిలిచింది. చైనాలో తనకు పోటీగా ఉన్న హువావేపై తీవ్రమైన దెబ్బ పడడం కూడా షియోమీకి కలిసి వచ్చింది. మొత్తంగా ఈ ఏడాది ఏప్రిల్​-జూన్ త్రైమాసికంలో అమ్మకాల్లో సత్తాచాటింది. ఏప్రిల్​-జూన్ క్వార్టర్​లో 19 శాతం అమ్మకాలతో స్మార్ట్​ఫోన్ల అమ్మకంలో మరోసారి సామ్​సంగ్ అగ్రస్థానంలో నిలువగా.. 17 శాతం షేర్​తో షియోమీ తొలిసారి రెండో స్థానానికి చేరిందని మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిస్​ నివేదిక వెల్లడించింది. యాపిల్​ను షియోమీ తొలిసారి అధిగమించిందని తెలిపింది. కాగా ఈ మూడు నెలల కాలంలో యాపిల్ 14 శాతం మార్కెట్ షేర్ అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచిందని, వివో, ఒప్పో అమ్మకాలు కూడా భారీగా పెరిగి టాప్​-5లో కొనసాగాయని పేర్కొంది.

'షియోమీ విదేశీ వ్యాపారం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా లాటిన్ అమెరికాకు షిప్​మెంట్లు ఏకంగా 300శాతం అధికమయ్యాయి. అలాగే ఆఫ్రికాకు 150 శాతం, పశ్చిమ యూరప్​కు 50 శాతం షిప్​మెంట్లలో వృద్ధి ఉంది. షియోమీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలెంజర్ స్థానం నుంచి ఆధిపత్యం చెలాయించే స్థానానికి ఆ సంస్థ చేరింది. ముఖ్యంగా వ్యాపార ప్లానింగ్​లో షియోమీ సక్సెస్ అయింది. భాగస్వామ్య ఒప్పందాలు, పాతస్టాక్​ను ఓపెన్​ మార్కెట్లో అమ్ముతూ చాలా జాగ్రత్తలు తీసుకోవడం షియోమీకి బాగా కలిసి వచ్చాయి' అని కెనాలిస్ రీసెర్చ్ మేనేజర్ బెన్​ స్టాన్​టన్ అన్నారు.

ముఖ్యంగా తక్కువ ధరకే మంచి స్పెసిఫికేషన్లు ఇస్తూ పెద్ద సంస్థలకు షియోమీ సవాల్ విసురుతోంది. వాల్యూ ఫర్ మనీ మంత్రంతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. సామ్​సంగ్​, యాపిల్​ హైఎండ్ మోడళ్లతో పోల్చుకుంటే దాదాపు అవే స్పెసిఫికేషన్లు ఇస్తూ షియోమీ 40 నుంచి 70 శాతం వరకు తక్కువ ధరతోనే ఫోన్లను తెస్తోంది. 'హై ఎండ్ డివైజ్​ల అమ్మకాలు భారీగా పెరగడంతో ఈ ఏడాది షియోమీ బాగా పుంజుకుంది.

ముఖ్యంగా ఎంఐ 11 అల్ట్రా బాగా పాపులర్ అయింది. అలాగే షియోమీకి ఒప్పో, వివో కూడా మంచి పోటీని ఇస్తున్నాయి. షియోమీ పాటిస్తున్న సూత్రాన్నే అవి కూడా అనుసరిస్తున్నాయి' అని స్టాన్​టన్ చెప్పారు. ముఖ్యంగా షియోమీ ఈ ఏడాది విడుదల చేసిన రెడ్​మీ నోట్​ 10 సిరీస్​తో పాటు ఎంఐ 11 సిరీస్ ఫోన్లు కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించాయి. ఈ మోడళ్ల అమ్మకాలు కూడా దూసుకెళ్లాయి. దీంతో స్మార్ట్​ఫోన్ల మార్కెట్లో షియోమీ దూకుడు చూపిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu