Ad Code

హెలికాప్టర్‌ తర్వాత ఇదే

వేల కిలో మీటర్ల దూరంలో దాడులు జరుపుతున్న అమెరికా సైనికులు తిరుగుబాటుదార్ల ఎదురు దాడికి తీవ్రంగా గాయపడి, సరైన చికిత్స లేకపోవటంతో మృతి చెందుతున్నారు. దీంతో గాయపడిన సైనికులకు సరైన చికిత్స అందించటానికి, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించటానికి ప్రత్యేకమైన వాహనాన్ని అమెరికా అభివృద్ధి చేస్తోంది. సైనికులను తరలించటానికి ప్రస్తుతం భారీ గన్‌హెలికాప్టర్లు వినియోగిస్తున్నా ఒక్కోసారి ఇవి శత్రువుల దాడికి గురై, ప్రమాదం తీవ్రత మరింతగా పెరిగి, మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అమెరికా మిలటరీ భావించింది. ప్రత్యేక వాహన తయారీ బాధ్యతలను 56 సంవత్సరాల ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్త రఫీయోలీకి అప్పగించారు. ఈయనే ఎగిరే కారును సైతం డిజైన్‌ చేశారు. ఈ ఎగిరే వాహనం మానవరహితంగా ఉండటం వల్ల ఎవరైనా దీని మీద దాడి చేసినా, ఎవ్వరికీ ప్రాణహాని ఉండదు. దీన్ని వేరే ప్రాంతం నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆపరేట్‌ చేస్తారు. ఈ వాహనానికి జిపిఎస్‌ (గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌)ను అనుసంధానించటం ద్వారా సైనికులు దట్టమైన అడవుల్లో ఉన్నా సులభంగా చేరుకోగలదు. దీనిలో ప్రత్యేకత ఏమంటే ఈ వాహనానికి, సైనికుడికి మధ్య సమాచారం పంచుకోవటానికి వీలుగా డిజిటల్‌ చిప్‌ ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ కోసం 2001నుండి అమెరికాకు చెందిన బోయింగ్‌, ఇజ్రాయిల్‌కు చెందిన ఏరోస్పేస్‌ ఇండిస్టీస్‌ సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వీటి పరిశోధనల ఫలితాలు చివరి దశకు చేరుకున్నట్లు దీని రూపకర్త రఫీయోలీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌ కోసం 1.5 మిలియన్‌ డాలర్లను వెచ్చించినట్లు అమెరికా మిలటరీ వెల్లడించింది. ఈ మానవరహిత వాహనం ప్రత్యేకత ఏమంటే ఇది భూమిపై నుంచి నిట్టనిలువుగా పైకి లేవటం దీని ప్రత్యేకత. ఇలా పైకి ఎగిరే వాహనం హెలికాప్టర్‌ తర్వాత ఇదే. హెలికాప్టర్‌ ఎగిరే సమయంలో ఒక్కోసారి కోణం మారుతుంటుంది. కానీ, ఇది ఎంతో వేగంగా పైకి ఎగరటం దీని ప్రత్యేకతగా రూపకర్త వివరిస్తున్నారు. అంతేగాక ఇందులో సైనికుడికి ప్రాధమిక చికిత్సకు కావాల్సిన సమస్త సామాగ్రి ఇందులోనే పొందుపరిచారు. అంతేగాక, ఆక్సిజన్‌ సైతం ఇందులో ఉంది. గాయపడిన సైనికుడు ఇందులో చేరిన తర్వాత అత్యంత వేగంగా తిరిగి సురక్షితమైన బేస్‌కి (సైనిక స్థావరానికి) చేరుతుంది. ఇప్పటికే దీనిపై పలుమార్లు ప్రయోగాలు జరిపినట్లు, తద్వారా ఇది విజయవంతం అయిందని వెల్లడిస్తున్నారు.
ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలు..
హెలికాప్టర్‌కు ఉండే బ్లేడ్స్‌ (రెక్కలు) పైకి ఎగరటానికి దోహదపడతాయి. అయితే ఈ మానవరహిత అంబులెన్స్‌ ఎగరటానికి అలాంటివి ఏమీ ఉండవు.
దీనికి అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ప్రొపెల్లర్లు వినియోగించారు. వాటిని వాహనానికి క్రింద భాగంలో అమర్చారు. ఆ ప్రొపెల్లర్స్‌ అత్యంత శక్తిని విడుదల చేయటం వల్ల వాహనం పైకి ఎగరుతుంది. దీనికి అవసరమైన ఇంధనం ఎలా అందిస్తారు అనేది రహస్యంగా ఉంచారు.
అవసరం అనుకుంటే తనంతట తానే వేగాన్ని నియంత్రించుకునే సౌకర్యం ఈ వాహనంలో పొందుపరిచారు. వాతావరణంలో ఏమైనా మార్పులు ఏర్పడితే ఈ విధానం ద్వారా సురక్షితంగా దిగటానికి దోహదపడుతుందని రూపకర్తలు తెలుపుతున్నారు.కొద్ది స్థలంలోనే ఇది ల్యాండింగ్‌ అవుతుంది.
వెంటనే ఎగరటానికి తక్కువ సమయం తీసుకుంటుంది. శత్రువు కంటికి కనిపించకుండా ప్రత్యేమైన ఏర్పాట్లూ దీనిలో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu